Revanth Reddy: బీసీ బిల్లుకు సహకరించాలని విపక్షాలకు పిలుపు 1 y ago
TG : పార్టీలకతీతంగా బీసీ బిల్లుకు సహకరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశంపై అన్ని పార్టీల నాయకులు రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాని మోడీని కలుద్దామని, 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తాను నాయకత్వం వహిస్తానన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు ప్రధాని అపాయింట్ మెంట్ ఇప్పించాలని, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కోటా ఆమోదం పొందేలా పోరాడుదామని పిలుపునిచ్చారు.
తాము చేసిన కులగణన నూటికి నూరు శాతం కరెక్ట్ అని, చట్టబద్దత కోసమే ఈ బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టామన్నారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కట్టుబడి ఉన్నామని, రాజకీయంగా కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. కులగణనకు సంబంధించి 2024 ఫిబ్రవరి 4న కేబినెట్ లో తీర్మానం చేశామని, 2025 ఫిబ్రవరి 4న కులగణన నివేదిక అసెంబ్లీలో ఆమోదం పొందిందని తెలిపారు. కాబట్టి ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా జరుపుకుందామన్నారు పేర్కొన్నారు.
కులగణన సర్వేలో మొదటిసారి పాల్గొనని వాళ్లకు రెండోసారి అవకాశం ఇచ్చామని, దాదాపు 3 కోట్ల 55 లక్షల మందికి పైగా సర్వేలో సంపూర్ణ వివరాలు తెలిపారన్నారు. వివాదాలకు తావులేకుండా అందరికీ న్యాయం చేస్తామని, బీసీలకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో న్యాయమే తమ లక్ష్యమని అన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే కులగణన చేశామని, బలహీన వర్గాలకు అండగా ఉండాలనే కామారెడ్డి డిక్లరేషన్ ప్రవేశపెట్టామని తెలిపారు.